నిరసన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నిరసన లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఉత్తరాంధ్ర గుండెలపై ఇన్ని కుంపట్లా?



మొన్నటి సోంపేట ప్రజల నిరసనను ఒక పక్క గుర్తిస్తున్నట్లు నటిస్తూనే ప్రభుత్వం దాని ప్రక్కనే వున్న వజ్రపుకొత్తూరు మండలంలోని గునిపల్లి, చీపురుపల్లి పక్క గ్రామాలనుండి సుమారు 1500 ల ఎకరాల వ్యవసాయ భూమిని మరో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలా ఒకే ప్రాంతంలో తొమ్మిది థర్మల్, ఓ అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం చేపట్టడం ద్వారా ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్రకాదా ఇది? ఇక్కడి ప్రజల నిస్సహాయతను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పాలక ప్రతిపక్ష నాయకులు లోపాయకారీ ఒప్పందాలతో ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. ఇంతటి ఘోరానికి ఒడిగట్టడానికి వీళ్ళకి మనసెలా ఒప్పుతోందో? ఈ ప్రశ్న కాస్తా విడ్డూరంగానే అనిపించొచ్చు. నిర్వాసిత పేకేజీల ఆశ చూపి వీరిని తమ భూమినుండి వేరుచేయడానికి కుట్ర జరుగుతోంది. నేలను కోల్పోయిన తరువాత వారి జీవన పరిస్థితులు ఎలాంటి ఒడిదుడుకులకు లోనవుతాయో, తద్వారా సమాజంలో రాబోయే పరిణామాలు ఎంతటి ఘోరానికి దారితీస్తాయో కాస్తా అవగాహన వున్న ఎవరికైనా తెలుస్తుంది. కానీ ప్రజల పట్ల, సమాజ పురోగతి పట్ల, భవిష్యత్ పరిణామాల పట్ల బాధ్యత లేని పాలక వర్గం ప్రజలను మోసంచేసి తద్వారా తమ సొంత లాభాలను మూటకట్టుకోజూడడం పెను విషాదం. కావున ప్రజలపై సాగుతున్న ఈ రకమైన రాక్షసకృత్యాన్ని ఆపేందుకు బాధ్యతగల ప్రజాస్వామ్య, పర్యావరణ, మేధావి వర్గం ముందుకు రావాల్సిన అవసరముంది.

4, ఫిబ్రవరి 2010, గురువారం

మన నేలను విషపూరితం చేస్తున్నారు

ఈ మధ్య కేంద్ర మంత్రివర్యులు జైరాం రమేష్ గారు ప్రతి రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతొ బి.టి. వంగాదాలపై ఆమోద ముద్ర కోసం సమావేశాలు పెడుతున్నారు. ప్రతి చోటా రైతు సోదరులు, శాస్త్రవేత్తలు తమ నిరసనను తెలియచేస్తున్నారు. కానీ వారి మాట వినేవారేవ్వరు. కిరాయి రైతులను ముందుగా మాటాడి౦చి అదే రికార్డు చేసుకు పోతున్నట్లుగా వుంది. ఏదో అంతా ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్సాకంగా చేస్తున్నట్లు భ్రమలు కల్పించే కార్యక్రమం తప్ప ఇది మరోటి కాదు. సెజ్ లకు ఆమోదం కోసం కూడా ఇలానే మీటింగులు చేసారు. కానీ తరువాత మన మాట ఎక్కడా అమలుకాబడలేదు. ఇది కూడా అలానే చేస్తున్నారు. బి.టి పత్తి సాగుచేసిన నెల బీడుగా మార్చబడుతో౦ది. అధిక ఉత్పత్తి పేరుతొ ఈ విషాన్ని మనలాంటి 3 వ ప్రపంచ దేశాలలో ప్రయోగిస్తున్నారు. మనలాంటి వ్యవసాయ ఆధారిత దేశాలలో అసంఘటిత రైతులున్న దగ్గర ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనిని గాట్ ఒప్పందంలో భాగంగా అమలుచేయజూస్తున్నారు. వంకాయకూర విరివిగా వినియోగించే మనం ఈ బీ.టీ.వంగడం ద్వారా వుత్పత్తి అయిన దానిని ఆహారంగా వినియోగిస్తే కాన్సర్ వంటి రోగాలబారిన పడతారని వ్యవాసాయ శాస్త్రవేత్తలుకూడా హెచ్చరిస్తున్నా, పాలక వర్గం ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోవడంలేదు. జన్యుపరమైన జబ్బులకు లోనయితే యిప్పటికే అరకొర వైద్య సౌకర్యాలున్న మన ప్రజలకు దిక్కెవరు. వుత్పత్తి పెంచి ఎవరికి మేలుచేయజూస్తున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధరలేక, వ్యవసాయం జూదంగా మారిన నేడు రైతుసోదరులతో పాటు, అవి వినియోగించే ప్రజల ఆరోగ్యంకు ఎవరు బాధ్యతవహిస్తారు? ప్రపంచీకరణ, సరళీకరణలపేరుతో జరుగుతున్న సామ్రాజ్యవాద దాడిని ప్రజలు నేడు అడ్డుకునే స్థితిలో లేని సమయంలో అమలుజరుగుతున్న ఈ వ్యాపారవర్గాల మోసపూరిత కుట్రను ఆపేదెవరు? సామాన్యుడివైపు నిలిచేదెవరు? అభివృద్ధి పేరుతో జరుగుతున్న యీ రకమైన పాలకవర్గాల దళారీ కుట్రను ప్రజాస్వామికవాదులు, మేధావివర్గం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం వుంది. మనకున్న వనరులను మనం సద్వినియోగం చేసుకుంటే చాలు. ఇప్పటికే వ్యవసాయం నుండి సన్నకారు, చిన్నకారు రైతులు దూరంచేయబడుతున్నారు. ఈ కార్పొరేట్ పాలకులను తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం వుంది.