3, డిసెంబర్ 2010, శుక్రవారం

సోంపేట ఉద్యమానికి ఏడాది..



ఈ రోజుకు సరిగ్గా ఏడాదిగా సోంపేటలో థర్మల్ విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా అక్కడి పర్యావరణ పరిరక్షణ సమితి వారు నిరాహారదీక్షా శిబిరాన్ని ప్రారంబించి వారి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. నేడు అక్కడ ఓ పెద్ద సభను నిర్వహిస్తున్నారు. సామాజిక కార్యకర్తలు స్వామి అగ్నివేశ్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ మధ్యకాలంలో వారిపై జరిగిన దాడులు, పోలీసు కాల్పులు, పిపిఎస్ కన్వీనర్ డా.క్రిష్ణమూర్తి గారి ఆసుపత్రిలో బాంబు పేలుడు మొ.న విషయాలు అందరికీ ఎరుకలోనికి వచ్చినవే..


కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం వారు ఇంతలా పోరాటం చేస్తున్న కంటితుడుపుగా ప్రభుత్వం అక్కడి థర్మల్ పవర్ ప్రోజెక్టుకు అనుమతులు మంజూరు నిలిపివేసామన్నదే కానీ, అసలు భూసేకరణకు సంబంధించి, నిర్వాసితులకు తాయిలాలు చూపడానికి కొత్త కొత్త జీవోలు, సవరణలు తెస్తూ, కొత్తగా పెసా చట్టానికి తూట్లు పొడిచేందుకు కూడా వెనకాడకుండా ప్రజల నోరుమూయించి భూమిని, నీటిని, వనరులను ప్రైవేటు పరం చేసేందుకు పెద్దయెత్తున ప్రపంచబ్యాంకు సంస్కరణలను అమలు చేయడానికి ముందుకు దూసుకు వస్తోంది. సెజ్ లపేరుతో కొత్తగా సామంత రాజ్యాలను ఏర్పాటు చేసుకొనేందుకు పెట్టుబడిదారులకు, ఎం.ఎన్.సి.లకు అవకాశం కల్పిస్తూ దేశ సార్వభౌమత్వాన్నే అమ్మకానికి పెడుతోంది. దీనికి మన కార్పొరేట్ పాలక వర్గం తీవ్రంగా కృషి చేస్తూ, ఉద్యమాలను రకరకాల బూచిని చూపెడుతూ అణచివేయ జూస్తోంది.,

సోంపేట స్ఫూర్తితో ప్రజాస్వామ్యవాదులు, పర్యావరణవాదులు, మేధావులు తప్పనిసరిగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించి, ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలవాలని ఆశిస్తున్నాం...

2, నవంబర్ 2010, మంగళవారం

పోలవరం కు అడ్డుకట్ట ఆదివాసీలపాలిట వరం

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పోలవరం అనుమతులపై షోకాజ్ నోటీసును ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ మొండివైఖరిని ప్రశ్నించిందన్న వార్త పర్యావరణ అభిమానులకు కాసింత ఊరటనిచ్చింది. దివంగత ముఖ్యమంత్రి పోలవరాన్ని సాధించి తీరుతానని ప్రకటించి ఆదివాసీల, మత్స్యకారుల, సాధారణ రైతులు, ముంపునకు గురయ్యే భూమిపుత్రుల రోదనను పెడచెవిన పెట్టి జాతీయ హోదాకోసం తీవ్రంగా ప్రయత్నించి ప్రజల, పర్యావరణ వేత్తల సూచనలను పట్టించుకోలేదు. సుమారు 5 లక్షలమంది ప్రజలను నిర్వాసితులుగా మార్చే ఈ భారీ ప్రాజెక్టు గర్భంలో కలిసిపోయే సహజ సంపదను ఎలా వెలకట్టగలరు. భారీ ప్రాజెక్టుల మూలంగా భూకంపాలొస్తున్నాయన్న సూచనలను పట్టించుకోకుండా ప్రాజెక్టు అనుమతులు రాకముందే కాల్వల నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించి ఆమ్యామ్యాలు మింగుతున్న వారికిది మింగుడుపడదు. అటు ఒరిస్సా, చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు తమ భూభాగంలో ముంపునకు గురయ్యే ప్రజల విజ్నప్తులను సుప్రీంకోర్టునకు విన్నవించి యున్నారు. అసలు ఇన్ని ఆటంకాల నడుమ వున్న ప్రాజెక్టును ఎలా పూర్తిచేయగలరు. ఓ 2000 ఎకరాలకు నీరందించే జంఘావతి ప్రాజెక్ట్, వంశధార రెండో దశలే ఒరిస్సావారి అభ్యంతరాలతో మూలన పడ్డాయి. అలాంటిది నిర్వాసితులౌతున్న వారి దగ్గరనుంచి, పొరుగు రాష్ట్రాల వారి అభ్యంతరాలతో ఎలా పూర్తి చేస్తారు. తమ ఫాక్షన్ పోకడలతో ఏదీ చెవినెక్కని వారికి తప్ప మిగిలిన వారికేమైంది. ప్రజల సుఖ సంతోషాలు నిజంగా కోరే వారైతే పర్యావరణ నిపుణుల సలహాలను పాటించి చిన్న చిన్న బ్యారేజీలను నిర్మించడం ద్వారా త్వరగా సాగునీరు అందించి అభివృద్ధికి పాటుపడవచ్చు. ఇందుకు టి.హనుమంతరావు వంటివారి సలహాలను, సూచనలను పాటించమని విన్నపం. పంతాలకు పోయి ప్రజలను నిర్వాసితులను చేసి, సామాజిక అంతరాలను పెంచడంద్వారా, భవిష్యత్తులో అటు సామాజికంగా, పర్యావరణ పరంగా ఎదురయ్యే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడం అసాధ్యం కావచ్చు.

నియాంగిరీ పర్వత శ్రేణులలోని 2000 మంది గిరిజనుల పోరాటాన్ని కీర్తించి వారికి సైనికుడిగా ప్రకటించుకున్న కాంగ్రెస్ యువరాజు ఇక్కడి 5 లక్షల మంది నిర్వాసితుల గోడు వినమని విజ్నప్తి చేస్తున్నాం..

Polavrm Article

Barrages Are Better Way
>

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఉత్తరాంధ్ర గుండెలపై ఇన్ని కుంపట్లా?



మొన్నటి సోంపేట ప్రజల నిరసనను ఒక పక్క గుర్తిస్తున్నట్లు నటిస్తూనే ప్రభుత్వం దాని ప్రక్కనే వున్న వజ్రపుకొత్తూరు మండలంలోని గునిపల్లి, చీపురుపల్లి పక్క గ్రామాలనుండి సుమారు 1500 ల ఎకరాల వ్యవసాయ భూమిని మరో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలా ఒకే ప్రాంతంలో తొమ్మిది థర్మల్, ఓ అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం చేపట్టడం ద్వారా ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్రకాదా ఇది? ఇక్కడి ప్రజల నిస్సహాయతను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పాలక ప్రతిపక్ష నాయకులు లోపాయకారీ ఒప్పందాలతో ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. ఇంతటి ఘోరానికి ఒడిగట్టడానికి వీళ్ళకి మనసెలా ఒప్పుతోందో? ఈ ప్రశ్న కాస్తా విడ్డూరంగానే అనిపించొచ్చు. నిర్వాసిత పేకేజీల ఆశ చూపి వీరిని తమ భూమినుండి వేరుచేయడానికి కుట్ర జరుగుతోంది. నేలను కోల్పోయిన తరువాత వారి జీవన పరిస్థితులు ఎలాంటి ఒడిదుడుకులకు లోనవుతాయో, తద్వారా సమాజంలో రాబోయే పరిణామాలు ఎంతటి ఘోరానికి దారితీస్తాయో కాస్తా అవగాహన వున్న ఎవరికైనా తెలుస్తుంది. కానీ ప్రజల పట్ల, సమాజ పురోగతి పట్ల, భవిష్యత్ పరిణామాల పట్ల బాధ్యత లేని పాలక వర్గం ప్రజలను మోసంచేసి తద్వారా తమ సొంత లాభాలను మూటకట్టుకోజూడడం పెను విషాదం. కావున ప్రజలపై సాగుతున్న ఈ రకమైన రాక్షసకృత్యాన్ని ఆపేందుకు బాధ్యతగల ప్రజాస్వామ్య, పర్యావరణ, మేధావి వర్గం ముందుకు రావాల్సిన అవసరముంది.

24, ఆగస్టు 2010, మంగళవారం

వేదాంతపై కోంధ్ ల విజయం



భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఇటీవల వార్తలకెక్కిన అగర్వాల్ యొక్క వేదాంత గ్రూపు ఒడిస్సాలో తలపెట్టిన బాక్సైట్ మైనింగ్, ఫ్యాక్టరీలకు కేంద్ర పర్యావరణ కమిటీ అంతర్జాతీయంగాను, దేశ పర్యావరణ ప్రజాస్వామ్య వాదుల వత్తిడికి తలొగ్గి అనుమతులను రద్దు చేసుకోవడం ప్రజా విజయంగానే గుర్తించాలి. లంజిఘర్ లో 1.7 బిలియన్ డాలర్ల బాక్సైట్ మైనింగ్ వలన అక్కడ స్థానికులైన అరుదైన తెగ కేవలం 8,000 మంది మాత్రమే మిగిలిన కోంధ్ గిరిజనుల ఉనికికే ప్రమాదంగా మారి, వారి ఆరాధ్య దేవతైన నియాంగిరీ కొండ అదృశ్యమయ్యే ప్రమాదాన్ని వాళ్ళు ముందుగానే పసిగట్టి అవతార్ సినిమాలోని తెగ పోరాటంవలే సామ్రాజ్య దళారీలను అడ్డుకునేందుకు అంతర్జాతీయంగా తమ పోరాటాన్ని, నిరసనను ప్రచారం చేయడంతో కేంద్రం దిగివచ్చి వేదాంతకు అనుమతులు నిరాకరించింది. కానీ, దళారీ కార్పొరేట్ పాలకుల తొత్తు అయిన ఒడిస్సా ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టులనుమతికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కనుక ప్రజాస్వామ్యవాదులు, పర్యావరణ వాదులు, మేధావులు కోంధ్ ల నిజమైన అవతార్ తరహా పోరాటాన్ని సమర్థిస్తూ వేదాంతను అడ్డుకొనేందుకు ముందుకు రావాలి.

2, జులై 2010, శుక్రవారం

ఈ ఫోటో ఓ పెద్ద వ్యాసానికి సమానం



ఈ కింది లింక్ లలో వివరాలు చూడొచ్చుః
The Great Indian Clearance Sale
Based on Center for Science and Environment's report on mining: http://www.cseindia.org/node/435
http://www.facebook.com/afsarm?v=wall&story_fbid=134092203279686#!/greatindiansale

14, జూన్ 2010, సోమవారం

ద.ఆఫ్రికాను ముంచే ప్రయత్నం..



ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతూ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో దేశాలన్నీ కుదేలైపోతున్న సమయంలో ద.ఆఫ్రికా వంటి తృతీయ ప్రపంచ దేశం, కొద్ది సం.ల క్రితం వరకు వలస బానిసత్వంలో మగ్గిన దేశం ఏం అభివృద్ధి సాధించిందని సాకర్ క్రీడలను వేలకోట్ల పెట్టుబడితో నిర్వహించాలనుకుంది. యూరోప్, పశ్చిమ దేశాల కుట్రలో ఇది కూరుకుపోయి ఈ భారాన్ని నెత్తికెత్తుకున్నట్లుగా అనిపిస్తోంది. తాము నిర్వహించి చేతులు కాల్చుకోకుండా ఇలా ఒక నిర్భాగ్య దేశాన్ని బలిచేసి మరో సోమాలియాగా మార్చేయడానికి పన్నాగంగా అనిపిస్తోంది.

ఇంతకు ముందు ఇండియాలో ఆసియాక్రీడలు నిర్వహించి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసారు. దీని నిర్వహణ వలన వచ్చిన ఆదాయమూలేదు, కొత్తగా వచ్చేసిన పతకాలూ లేవు. ఇలాంటిదే మరల అక్కడ జరుగుతోంది. ఆ దేశం గొప్పగా చెప్పుకునే క్రీడాకారులు గానీ, వాళ్ళు సంపాదించిన అంతర్జాతీయ స్థాయి పతకాలూ లేవు. మరి ఏమాశించి ఈ క్రీడలు జరప నిర్ణయం తీసుకున్నారో. అక్కడి రాజకీయ నాయకులు, అధికారులు కోటీశ్వరులవ్వడం ఖాయం. ప్రజలు మరో దశాబ్ధం పాటు వెనకబడడం ఖాయం. ఇలా అంతర్జాతీయ క్రీడలు నిర్వహించే ముందు తమ స్థాయిని గుర్తెరిగి నిర్వహిస్తే మంచిది. లేకపోతే భవిష్యత్ తరాలు వీళ్ళ నిర్వాకానికి అడుక్కు తినాలి.

ఆ మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అరువు క్రీడాకారులతో బాబు కూడా ఇలానే జాతీయ క్రీడలు నిర్వహించారు. దాంతో మరింత అప్పులు పెరిగాయి తప్ప మరేమీ లేదు.

ఇదంతా ప్రజలను అథఃపాతాళానికి తొక్కే రాజకీయ నాయకుల క్రీడా విన్యాసాలు తప్ప మరేమీ కాదు. ఆఫ్రికా వాసులారా బహు పరాక్.

7, జూన్ 2010, సోమవారం

పాతికేళ్ళ తరువాత కూడా కన్నీళ్ళే మిగిల్చారు..

భూమ్మీద జరిగిన అత్యంత విషాదకర, వినాశకర సంఘటనగా పేర్కొనబడ్డ భోపాల్ గాస్ దుర్ఘటనపై ఈ రోజు స్థానిక కోర్టు యిచ్చిన తీర్పు బాధితులకు యిన్నేళ్ళ తరువాత కూడా కన్నీళ్ళే మిగిల్చింది. కేసులో వున్న నాటి యూనియన్ కార్బైడ్ ఇండియా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా మరి 7 గురిని దోషులుగా నిర్థారిస్తూ తీర్పు చెప్పింది. వీళ్ళకు 3500 మందికి పైగా చావుకు, అనేక వేల మంది తీవ్ర అనారోగ్యానికి కారణమైన వారికి రెండు సం.ల కారాగార శిక్ష కొంత మొత్తం జరిమానా విధించవచ్చని తెలుస్తోంది. అసలు దోషిఅయిన కంపెనీ చైర్మన్ వారన్ ఆండర్సన్ ను పరారీలో వున్న నిందితుడుగా చూపిస్తున్నారు. ఇదీ మన న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పుల ప్రతిఫలం. డబ్బు, అధికారం వున్న వారినేం చేయలేనితనం. సామ్రాజ్యవాదులకు దాసోహమైన బానిసతనం. ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు సరైన పరిహారమే అందలేదన్నది సత్యదూరం కాదు. ఇలాంటి వ్యవస్థలున్న చోట అణువిద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడానికి అత్యుత్సాహం చూపుతున్న మన పాలక వర్గం ఖర్మ కాలి ఏదైనా జరిగితే దేశంలో జనాభా తగ్గిందిలే అని సంతృప్తి పడతారేమో. సరైన రక్షణ కార్యాచరణ లేకుండా, పర్యావరణం నాశనమయ్యి జనావళి మనుగడ ప్రశ్నార్థకమవుతున్న కాలంలో వున్న మనం యిటువంటి కర్మాగారాలకు, ప్రాజెక్టులకు, వినాశకర అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాడకపోతే భవిష్యత్ తరమే కాదు ఈ తరంకూడా భూమ్మీద బతికే చాన్సు ఉండదు, కొత్త కొత్త జబ్బులతో నరకయాతన పడక తప్పని స్థితి ఎంతో దూరంలో లేదు.

భోపాల్ మృతులకు మరోమారు శ్రద్ధాంజలి ఘటిద్దాం. వారి వారసుల పోరాటానికి మద్దతునిద్దాం..



http://www.telegraph.co.uk/news/worldnews/asia/india/7807904/Bhopal-managers-face-prison-for-role-in-Union-Carbide-gas-disaster.html

http://news.rediff.com/slide-show/2010/jun/07/slide-show-1-bhopal-gas-tragedy-verdict.htm