21, ఏప్రిల్ 2011, గురువారం

ధరిత్రీ దినోత్సవం



మన రోజువారీ జీవితంలో వేగంపెరిగిన దృష్ట్యా ప్రతి అంశానికి ఏదో ఒక దినోత్సవం పేరుతో జరుపుకోకపోతే అది ఎంత ప్రాణాంతకమైనదైనా లేక ఎంత అభిమాన పూర్వకమైనదైనా మరిచిపోతుంటాం.. అలాగే మన ఉనికికి అస్తిత్వానికి ఆధారభూతమైన ప్రకృతి భూమిని కాపాడుకోవడం గురించి ఎంతలా చెప్పుకున్నా మన కృషి అటువైపుగా చాలా తక్కువ శాతం మాత్రమే జరుగుతున్నదన్నది విస్పష్టం.. ఇటీవల జపాన్ లో వచ్చిన సునామీ, తుఫాన్ లు, భూకంపాలు మనల్ని ఎంతమాత్రం కదిలించడంలేదు.. భూమి లేకపోతే నిలువనీడలేదన్నది మరిచిపోయి దాని ఉనికినే ప్రశ్నార్థకం చేసుకుంటున్నాం చేజేతులా... న్యూక్లియర్ పవర్ ప్లాంట్లు, ధర్మల్ పవర్ ప్లాంట్లు, నర్మదా, పోలవరం వంటి భారీ నీటిపారుదల ప్రాజెక్టుల నిర్మాణం వంటివి చేపట్టి ప్రకృతి భీభత్సానికి గురికావడానికి కారకులవుతున్నాం.. మనమంటే మనం కాదు కదా ప్రభువులు ఏలిన వారు చేస్తున్నదానికి మనమేం జేస్తాం అనుకోవచ్చు. కానీ వాటిని అడ్డుకోవాల్సిన బాధ్యత మనదే... వాళ్ళ వ్యాపార దృక్పథానికి ఏమీ అడ్డురావు. బాక్సైటు తవ్వకాలతో భూగర్భజలాలు అడుగంటి మన ఉనికితో పాటు పర్యావరణ కాలుష్యం పెరిగి అటవీ సంపద నాశనమవుతుందని తెలిసినా నియాంగిరీ పర్వత శ్రేణులనుండి ఇటు పాడేరు వరకు తవ్వకాలను ప్రోత్సహిస్తున్నారు.. ఇలా మానవుల ఉనికికి ముప్పుగా పరిణమిస్తున్న వాటిని తీవ్రంగా వ్యతిరేకించి పోరాటం చేయకపోతే అస్తిత్వాన్ని కోల్పోతాం.. రోజు రోజుకు పెరుగుతున్న కాలుష్యం మనపాలిట మృత్యువు అన్నది గుర్తెరిగి పర్యావరణాన్ని కాపాడుకొని, ప్రకృతి సంతులతను నిలబెట్టే దిశగా ప్రయత్నం తీవ్రతరం చేయక్పోతే ఎన్ని ధరిత్రీ దినోత్సవాలు వచ్చి వెళ్ళినా ప్రయోజనం లేదు...

రండి కలిసి భూమిని కాపాడుకుందాం....

12, ఏప్రిల్ 2011, మంగళవారం

గగనంలో గగారిన్ కు ఏభై ఏళ్ళు...

ట్రైనో బస్సో ఎక్కడానికి
భయపడే రోజుల్లో
తిరిగి వస్తావో రావో
తెలీని సుదూర శూన్యలోక
విహారానికి ఎగిరి వెళ్ళడానికి
ముందుకురికిన నీ తొలి
గుండెనిబ్బరానికి జోహార్లు
గగారిన్ యూరి గగారిన్!

చివ్వున నిప్పులు చిమ్ముతూ
నింగికెగసిన రాకెట్ తో
గగన విహారం చేసి
మానవాఃళి మొత్తానికి
ఓ మహత్తర మార్గాన్ని చూపి
నిబ్బరాన్ని కలుగజేసి
గుండెనిండా ఊపిరైన
నీ సాహసానికి జోహార్లు జోహార్లు..
(గగనంలో విహరించిన తొలి మానవుడు యూరి గగారిన్ సాహసానికి 50 ఏళ్ళు నిండిన సందర్భంగా)
ఆనాటి వీడియో

11, మార్చి 2011, శుక్రవారం

విలయం..



కట్టుకున్నవన్నీ

పేకమేడలా
కూలిపోయిన
క్షణం...

మాటాడుకుంటున్న

మా మధ్య విరిగిపడిన

పైకప్పు...


వేలి చివరాశరాతో

నడుస్తున్న
చిన్నారిని

మింగేసిన అల...


కాలికింద
చీలిపోయిన

నేల తల్లి
నిర్దయగా
మమ్మల్ని

మింగేసి
ఖాళీని
పూరించుకున్న

దుర్దినం...


ఇంత దయలేనితనం

మా మీదనేల తల్లీ

చూపావు?

13, జనవరి 2011, గురువారం

భారతదేశం వలసలవారితో నిండినదే-సుప్రీం కోర్ట్ తీర్పు..

మహారాష్ట్రలో మే తొంభై నాలుగులో నందాబాయి అనే భిల్ ఆదివాసీ యువతిపై జరిగిన అత్యాచారం, దాడి, వివస్త్రను చేసి ఊరేగించడంపై ఉన్నత న్యాయస్థానం వెలువరించిన తీర్పులో భారతదేశం ఉత్తర అమెరికా వలే పూర్తిగా వలసల వారితో నిండిపోయిందని ఓ ముఖ్యమైన తీర్పును వెలువరించింది. ఈ దేశ ఆదివాసీ జనమే ఇక్కడి భూమిపుత్రులని తీర్పునివ్వడం చాలామందికి చెంపపెట్టులాంటిది. తీర్పు పాఠం చదవండి..

Full Text of SC Jud 351589a

3, డిసెంబర్ 2010, శుక్రవారం

సోంపేట ఉద్యమానికి ఏడాది..



ఈ రోజుకు సరిగ్గా ఏడాదిగా సోంపేటలో థర్మల్ విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా అక్కడి పర్యావరణ పరిరక్షణ సమితి వారు నిరాహారదీక్షా శిబిరాన్ని ప్రారంబించి వారి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. నేడు అక్కడ ఓ పెద్ద సభను నిర్వహిస్తున్నారు. సామాజిక కార్యకర్తలు స్వామి అగ్నివేశ్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ మధ్యకాలంలో వారిపై జరిగిన దాడులు, పోలీసు కాల్పులు, పిపిఎస్ కన్వీనర్ డా.క్రిష్ణమూర్తి గారి ఆసుపత్రిలో బాంబు పేలుడు మొ.న విషయాలు అందరికీ ఎరుకలోనికి వచ్చినవే..


కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం వారు ఇంతలా పోరాటం చేస్తున్న కంటితుడుపుగా ప్రభుత్వం అక్కడి థర్మల్ పవర్ ప్రోజెక్టుకు అనుమతులు మంజూరు నిలిపివేసామన్నదే కానీ, అసలు భూసేకరణకు సంబంధించి, నిర్వాసితులకు తాయిలాలు చూపడానికి కొత్త కొత్త జీవోలు, సవరణలు తెస్తూ, కొత్తగా పెసా చట్టానికి తూట్లు పొడిచేందుకు కూడా వెనకాడకుండా ప్రజల నోరుమూయించి భూమిని, నీటిని, వనరులను ప్రైవేటు పరం చేసేందుకు పెద్దయెత్తున ప్రపంచబ్యాంకు సంస్కరణలను అమలు చేయడానికి ముందుకు దూసుకు వస్తోంది. సెజ్ లపేరుతో కొత్తగా సామంత రాజ్యాలను ఏర్పాటు చేసుకొనేందుకు పెట్టుబడిదారులకు, ఎం.ఎన్.సి.లకు అవకాశం కల్పిస్తూ దేశ సార్వభౌమత్వాన్నే అమ్మకానికి పెడుతోంది. దీనికి మన కార్పొరేట్ పాలక వర్గం తీవ్రంగా కృషి చేస్తూ, ఉద్యమాలను రకరకాల బూచిని చూపెడుతూ అణచివేయ జూస్తోంది.,

సోంపేట స్ఫూర్తితో ప్రజాస్వామ్యవాదులు, పర్యావరణవాదులు, మేధావులు తప్పనిసరిగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించి, ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలవాలని ఆశిస్తున్నాం...

2, నవంబర్ 2010, మంగళవారం

పోలవరం కు అడ్డుకట్ట ఆదివాసీలపాలిట వరం

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పోలవరం అనుమతులపై షోకాజ్ నోటీసును ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ మొండివైఖరిని ప్రశ్నించిందన్న వార్త పర్యావరణ అభిమానులకు కాసింత ఊరటనిచ్చింది. దివంగత ముఖ్యమంత్రి పోలవరాన్ని సాధించి తీరుతానని ప్రకటించి ఆదివాసీల, మత్స్యకారుల, సాధారణ రైతులు, ముంపునకు గురయ్యే భూమిపుత్రుల రోదనను పెడచెవిన పెట్టి జాతీయ హోదాకోసం తీవ్రంగా ప్రయత్నించి ప్రజల, పర్యావరణ వేత్తల సూచనలను పట్టించుకోలేదు. సుమారు 5 లక్షలమంది ప్రజలను నిర్వాసితులుగా మార్చే ఈ భారీ ప్రాజెక్టు గర్భంలో కలిసిపోయే సహజ సంపదను ఎలా వెలకట్టగలరు. భారీ ప్రాజెక్టుల మూలంగా భూకంపాలొస్తున్నాయన్న సూచనలను పట్టించుకోకుండా ప్రాజెక్టు అనుమతులు రాకముందే కాల్వల నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించి ఆమ్యామ్యాలు మింగుతున్న వారికిది మింగుడుపడదు. అటు ఒరిస్సా, చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు తమ భూభాగంలో ముంపునకు గురయ్యే ప్రజల విజ్నప్తులను సుప్రీంకోర్టునకు విన్నవించి యున్నారు. అసలు ఇన్ని ఆటంకాల నడుమ వున్న ప్రాజెక్టును ఎలా పూర్తిచేయగలరు. ఓ 2000 ఎకరాలకు నీరందించే జంఘావతి ప్రాజెక్ట్, వంశధార రెండో దశలే ఒరిస్సావారి అభ్యంతరాలతో మూలన పడ్డాయి. అలాంటిది నిర్వాసితులౌతున్న వారి దగ్గరనుంచి, పొరుగు రాష్ట్రాల వారి అభ్యంతరాలతో ఎలా పూర్తి చేస్తారు. తమ ఫాక్షన్ పోకడలతో ఏదీ చెవినెక్కని వారికి తప్ప మిగిలిన వారికేమైంది. ప్రజల సుఖ సంతోషాలు నిజంగా కోరే వారైతే పర్యావరణ నిపుణుల సలహాలను పాటించి చిన్న చిన్న బ్యారేజీలను నిర్మించడం ద్వారా త్వరగా సాగునీరు అందించి అభివృద్ధికి పాటుపడవచ్చు. ఇందుకు టి.హనుమంతరావు వంటివారి సలహాలను, సూచనలను పాటించమని విన్నపం. పంతాలకు పోయి ప్రజలను నిర్వాసితులను చేసి, సామాజిక అంతరాలను పెంచడంద్వారా, భవిష్యత్తులో అటు సామాజికంగా, పర్యావరణ పరంగా ఎదురయ్యే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడం అసాధ్యం కావచ్చు.

నియాంగిరీ పర్వత శ్రేణులలోని 2000 మంది గిరిజనుల పోరాటాన్ని కీర్తించి వారికి సైనికుడిగా ప్రకటించుకున్న కాంగ్రెస్ యువరాజు ఇక్కడి 5 లక్షల మంది నిర్వాసితుల గోడు వినమని విజ్నప్తి చేస్తున్నాం..

Polavrm Article

Barrages Are Better Way
>

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఉత్తరాంధ్ర గుండెలపై ఇన్ని కుంపట్లా?



మొన్నటి సోంపేట ప్రజల నిరసనను ఒక పక్క గుర్తిస్తున్నట్లు నటిస్తూనే ప్రభుత్వం దాని ప్రక్కనే వున్న వజ్రపుకొత్తూరు మండలంలోని గునిపల్లి, చీపురుపల్లి పక్క గ్రామాలనుండి సుమారు 1500 ల ఎకరాల వ్యవసాయ భూమిని మరో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలా ఒకే ప్రాంతంలో తొమ్మిది థర్మల్, ఓ అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం చేపట్టడం ద్వారా ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్రకాదా ఇది? ఇక్కడి ప్రజల నిస్సహాయతను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పాలక ప్రతిపక్ష నాయకులు లోపాయకారీ ఒప్పందాలతో ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. ఇంతటి ఘోరానికి ఒడిగట్టడానికి వీళ్ళకి మనసెలా ఒప్పుతోందో? ఈ ప్రశ్న కాస్తా విడ్డూరంగానే అనిపించొచ్చు. నిర్వాసిత పేకేజీల ఆశ చూపి వీరిని తమ భూమినుండి వేరుచేయడానికి కుట్ర జరుగుతోంది. నేలను కోల్పోయిన తరువాత వారి జీవన పరిస్థితులు ఎలాంటి ఒడిదుడుకులకు లోనవుతాయో, తద్వారా సమాజంలో రాబోయే పరిణామాలు ఎంతటి ఘోరానికి దారితీస్తాయో కాస్తా అవగాహన వున్న ఎవరికైనా తెలుస్తుంది. కానీ ప్రజల పట్ల, సమాజ పురోగతి పట్ల, భవిష్యత్ పరిణామాల పట్ల బాధ్యత లేని పాలక వర్గం ప్రజలను మోసంచేసి తద్వారా తమ సొంత లాభాలను మూటకట్టుకోజూడడం పెను విషాదం. కావున ప్రజలపై సాగుతున్న ఈ రకమైన రాక్షసకృత్యాన్ని ఆపేందుకు బాధ్యతగల ప్రజాస్వామ్య, పర్యావరణ, మేధావి వర్గం ముందుకు రావాల్సిన అవసరముంది.