14, జూన్ 2010, సోమవారం

ద.ఆఫ్రికాను ముంచే ప్రయత్నం..



ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతూ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో దేశాలన్నీ కుదేలైపోతున్న సమయంలో ద.ఆఫ్రికా వంటి తృతీయ ప్రపంచ దేశం, కొద్ది సం.ల క్రితం వరకు వలస బానిసత్వంలో మగ్గిన దేశం ఏం అభివృద్ధి సాధించిందని సాకర్ క్రీడలను వేలకోట్ల పెట్టుబడితో నిర్వహించాలనుకుంది. యూరోప్, పశ్చిమ దేశాల కుట్రలో ఇది కూరుకుపోయి ఈ భారాన్ని నెత్తికెత్తుకున్నట్లుగా అనిపిస్తోంది. తాము నిర్వహించి చేతులు కాల్చుకోకుండా ఇలా ఒక నిర్భాగ్య దేశాన్ని బలిచేసి మరో సోమాలియాగా మార్చేయడానికి పన్నాగంగా అనిపిస్తోంది.

ఇంతకు ముందు ఇండియాలో ఆసియాక్రీడలు నిర్వహించి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసారు. దీని నిర్వహణ వలన వచ్చిన ఆదాయమూలేదు, కొత్తగా వచ్చేసిన పతకాలూ లేవు. ఇలాంటిదే మరల అక్కడ జరుగుతోంది. ఆ దేశం గొప్పగా చెప్పుకునే క్రీడాకారులు గానీ, వాళ్ళు సంపాదించిన అంతర్జాతీయ స్థాయి పతకాలూ లేవు. మరి ఏమాశించి ఈ క్రీడలు జరప నిర్ణయం తీసుకున్నారో. అక్కడి రాజకీయ నాయకులు, అధికారులు కోటీశ్వరులవ్వడం ఖాయం. ప్రజలు మరో దశాబ్ధం పాటు వెనకబడడం ఖాయం. ఇలా అంతర్జాతీయ క్రీడలు నిర్వహించే ముందు తమ స్థాయిని గుర్తెరిగి నిర్వహిస్తే మంచిది. లేకపోతే భవిష్యత్ తరాలు వీళ్ళ నిర్వాకానికి అడుక్కు తినాలి.

ఆ మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అరువు క్రీడాకారులతో బాబు కూడా ఇలానే జాతీయ క్రీడలు నిర్వహించారు. దాంతో మరింత అప్పులు పెరిగాయి తప్ప మరేమీ లేదు.

ఇదంతా ప్రజలను అథఃపాతాళానికి తొక్కే రాజకీయ నాయకుల క్రీడా విన్యాసాలు తప్ప మరేమీ కాదు. ఆఫ్రికా వాసులారా బహు పరాక్.

7, జూన్ 2010, సోమవారం

పాతికేళ్ళ తరువాత కూడా కన్నీళ్ళే మిగిల్చారు..

భూమ్మీద జరిగిన అత్యంత విషాదకర, వినాశకర సంఘటనగా పేర్కొనబడ్డ భోపాల్ గాస్ దుర్ఘటనపై ఈ రోజు స్థానిక కోర్టు యిచ్చిన తీర్పు బాధితులకు యిన్నేళ్ళ తరువాత కూడా కన్నీళ్ళే మిగిల్చింది. కేసులో వున్న నాటి యూనియన్ కార్బైడ్ ఇండియా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా మరి 7 గురిని దోషులుగా నిర్థారిస్తూ తీర్పు చెప్పింది. వీళ్ళకు 3500 మందికి పైగా చావుకు, అనేక వేల మంది తీవ్ర అనారోగ్యానికి కారణమైన వారికి రెండు సం.ల కారాగార శిక్ష కొంత మొత్తం జరిమానా విధించవచ్చని తెలుస్తోంది. అసలు దోషిఅయిన కంపెనీ చైర్మన్ వారన్ ఆండర్సన్ ను పరారీలో వున్న నిందితుడుగా చూపిస్తున్నారు. ఇదీ మన న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పుల ప్రతిఫలం. డబ్బు, అధికారం వున్న వారినేం చేయలేనితనం. సామ్రాజ్యవాదులకు దాసోహమైన బానిసతనం. ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు సరైన పరిహారమే అందలేదన్నది సత్యదూరం కాదు. ఇలాంటి వ్యవస్థలున్న చోట అణువిద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడానికి అత్యుత్సాహం చూపుతున్న మన పాలక వర్గం ఖర్మ కాలి ఏదైనా జరిగితే దేశంలో జనాభా తగ్గిందిలే అని సంతృప్తి పడతారేమో. సరైన రక్షణ కార్యాచరణ లేకుండా, పర్యావరణం నాశనమయ్యి జనావళి మనుగడ ప్రశ్నార్థకమవుతున్న కాలంలో వున్న మనం యిటువంటి కర్మాగారాలకు, ప్రాజెక్టులకు, వినాశకర అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాడకపోతే భవిష్యత్ తరమే కాదు ఈ తరంకూడా భూమ్మీద బతికే చాన్సు ఉండదు, కొత్త కొత్త జబ్బులతో నరకయాతన పడక తప్పని స్థితి ఎంతో దూరంలో లేదు.

భోపాల్ మృతులకు మరోమారు శ్రద్ధాంజలి ఘటిద్దాం. వారి వారసుల పోరాటానికి మద్దతునిద్దాం..



http://www.telegraph.co.uk/news/worldnews/asia/india/7807904/Bhopal-managers-face-prison-for-role-in-Union-Carbide-gas-disaster.html

http://news.rediff.com/slide-show/2010/jun/07/slide-show-1-bhopal-gas-tragedy-verdict.htm