30, మే 2010, ఆదివారం

సెల్ సిగ్నల్స్ వలన ఆహార భద్రతకు ముప్పు



ఇప్పటికే జన్యు మార్పిడి పంటల వలన, పురుగు మందుల కారణంగా తేనెటీగల కాలనీలు కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రమాదం సెల్ ఫోన్ విడుదల చేస్తున్న విద్యుదయస్కాంత రేడియేషన్ వలన కూడా ఉంటుందని పంజాబ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు గమనించారు. సెల్ ఫోన్ రేడియేషన్ తేనెటీగల శరీరంలో ఉండే అయస్కాంతత్వంపై ప్రభావం చూపడం వలన తేనెటీగల సామర్థ్యం దెబ్బతింటోందని వారు చెబుతున్నారు. సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చే తరంగాల కారణంగా తేనెటీగల తేనె సేకరించే సామర్థ్యం దెబ్బతిన్నట్లు కేరళకు చెందిన సయినుద్దీన్ పట్టాజే చేసిన అధ్యయనంలో కూడా వెల్లడైంది. తేనెటీగల సంఖ్య తగ్గిపోతే సహజంగా జరిగే పరపరాగ సంపర్కం మందగించిపోతుందని, దీంతో కాయలు, పళ్ళ చెట్ల ఉనికి నశించి, ఆహార భద్రతకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే పిచ్చుకలు, హమ్మింగ్ బర్డ్స్ వంటి పక్షిజాతులు సెల్ సిగ్నల్స్ వలన అంతరించిపోతున్నాయి. అలాగే వీటి వలన మన మెదడుపై కూడా దుష్ప్రభావాలు చాల వున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇది మానవ సంబంధాలపై చూపుతున్న దుష్ప్రభావాలు మన గ్రహింపులో వున్నా మన దైనందిన జీవితంలో భాగమైపోయిన ఈ సెల్ ను ప్రస్తుతం వినియోగించకుండా ఆపే స్థితిలో లేము కాబట్టి దీనికి ప్రత్యామ్యాయ పద్ధతులపై నివారణ చర్యలపై శాస్త్రవేత్తలు దృష్తి సారించకపోతే ఈ సెల్ ద్వాపరయుగంలోని ముసలంలా మన యుగాన్ని అంతం చేసె మహమ్మారి కాగలదు.


(ఆంధ్రజ్యోతి 29.05.2010 వార్త ఆధారంగా)

22, మే 2010, శనివారం

ఈ దశాబ్ధపు ఘోర విషాదం



ఈ దశాబ్ధంలోనే అతి పెద్ద ప్రమాదం, భారత్ లో జరిగిన మూడో ఘోర ప్రమాదంగా అందరిని కలచివేసిన మంగళూరు విమాన ప్రమాదం. ఎవరి తప్పిదంవలన జరిగినా 167 నిండు ప్రాణాలను బలిగొన్నారు.

ఈ మధ్య ఏదైనా సంఘటన జరిగితే రాజీనామా చేస్తాననడం మన మంత్రివర్యులకు ఫ్యాషన్ అయ్యింది. ఎలాగూ ఆమోదించరని తెలిసి ఈ నాటకం. ఎంత ఎక్స్ గ్రేషియా ఇస్తే మాత్రం పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా. ఆ కొండలు గుట్టలలో విమానాశ్రయం, చిన్న రన్ వే పై భారీ విమానాలను దించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే.

సంతాప తీర్మానాలు కాదు ప్రమాద నివారణ చర్యలు చేపట్టి భవిష్యత్ తరాలకు నిబ్బరాన్నివ్వాలని కోరుకుందాం.. యిది అత్యాశేనా?..