16, జూన్ 2011, గురువారం

నింగీ నేలా నీదేరా...



ఈ గాలీ, నేలా, నీరూ. నిప్పూ, నింగీ మాది

అని నినదిస్తున నీ గొంతు

భావి తరానికి ఓ ఆసరా కోసం

నీవెత్తిన ఆ చిరుపిడికిలి

ఈ గాంధారీ పుత్రులకు

కన్నెర్ర చేస్తోంది...

ఎవడికి కావాలి పిలగాడా నీ గోడు

నువ్వు మా జాతివాడివి కాదు

కులపోడివి కాదు

వున్నోడివి కాదు

లేక పోతేనా నీ పక్క

ఎన్ని ప్రకటనలో ఇచ్చేవాళ్ళం

ప్రతి పేపరోడు నీ గురించి రాసేవాడు

కానీ నీవు గోచీ గుడ్డా లేని ఆదివాసీవి

నీకొక్కడికే ఎందుకు ఈ గోలని

దీర్ఘాలు తీస్తున్నారు మరి

అభివృద్ధి నిరోధకుడుగా నీ మీద ముద్రవేసి

తీవ్ర వాదిని చేసి ఎన్ కౌంటర్ చేసేయాలని చూస్తున్నాడు

పోస్కో వాడు విదిలించి ఎంగిలి మెతుకులకు

వీళ్ళు కన్నతల్లినైనా పండబెట్టడానికి వెనకాడని సాములురా...

నువ్వు చచ్చిపోతే ఎవడిక్కావాలి?

నువ్వేసిన ఓట్లెన్ని? నువ్వు కట్టే ఆదాయప్పన్నెంత?

నువ్వుంటే ఎంత లేకుంటే ఎంత?

నీకింకా మా (అ)నాగరికత అంటనందుకు

చిదంబరం చీదరించుకుంటున్నాడక్కడ..

నవీన పట్టాయుడ్లు కలత చెందుతున్నారిక్కడ..

నీ గుడిసెపై ఓ డిష్ పెడ్తాం నీకో రంగుల డబ్బా ఇస్తాం

ఇంక నువ్వు నాగరీకుడవై పోతావ్!

మా సంపద పెరిగితే చాలు

పుడమి తల్లి పురుగులు పట్టిపోతే మాకేం?


అయినా నీ పిలుపు విన్న ప్రకృతి

నీకు తోడుగా వుందన్నది సత్యం!

ఆపకు నీ పోరాటం..

నీదే ఈ నేల...నీవే మా రేపటి కలల రాజువి...


(పోస్కో వ్యతిరేక పోరాటం ఈ రోజు తీవ్రమౌతున్న సందర్భంగా సంఘీభావంగా)