23, ఫిబ్రవరి 2010, మంగళవారం

ఆఫ్ఘన్ భూభాగంపై నాటో మారణకాండ



ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల ఏరివేత పేరుతో ఇప్పటికే టన్నులకొద్ది బాంబు దాడులు చేస్తున్న నాటో దళాలు గత వారం రోజుల్లో సుమారు 50 మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసాయి. మజ్రా ప్రాంతంలో మొన్న జరిగిన వైమానిక దాడిలో మూడు జీపులలో వెళ్తున్న సామాన్య పౌరులు 27 మంది చనిపోయారు. దీనిపై ప్రజలలో తీవ్రమైన ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో తమ కీలుబొమ్మ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా దీనిని ఖండిస్తూ సివిలియన్ మరణాలు లేకుండా చూడమని మొత్తుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా నాటో కమాండర్ క్శమాపణలు చెప్పాడు. సారీ చెప్పినంత మాత్రాన వారి ప్రాణాలు తిరిగివస్తాయా? ఆఫ్ఘనిస్తాన్ పై గత 30 ఏళ్ళకు పైగా పరాయి దేశాల ఆధిపత్యం కొనసాగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా స్థానిక గిరిజనులు, ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన అగ్రరాజ్యం దాని ఫలితాన్ని అనుభవిస్తోంది. తిరిగి అదే ఉగ్రవాదాన్ని రూపుమాపుతానని అక్కడి ప్రజల మాన ప్రాణాలను హరిస్తోంది. ఎవరి భూభాగం వారు పాలించుకునే స్వేచ్చ లేకుండా తమ అవసరాలు తీర్చుకొనడానికి దురాక్రమణలు చేసి, అక్కడి ప్రభుత్వాలను కూలదోసి, తమ సొంత కీలుబొమ్మ పాలకులతో నడిపించి తమ వ్యాపారాలను నిరాటంకంగా చేసుకునే అగ్రరాజ్య దురహంకారాన్ని వ్యతిరేకించాలి. దానికి వత్తాసు పలికే నాటో సభ్యదేశాల కుటిల రాజనీతిని బయటపెట్టాలి.

17, ఫిబ్రవరి 2010, బుధవారం

ఈ సెక్యులర్ దేశంలో ఆమెకి౦త చోటివ్వలేమా?




తన రచనల ద్వారా మాతృదేశ బహిష్కరణకు గురై ప్రస్తుతం తానూ తన దేశంకంటే ఎక్కువగా అభిమానించే ఈ సువిశాల భారత దేశంలో తనకు నీడనిమ్మని దీనంగా వేడుకుంటున్న తస్లీమాను ఏ ప్రయోజనాలకు బలిచేస్తున్నారో? ముస్లిం వర్గం నుండి వచ్చిన బెదిరింపులకు లొంగి ఆమెకు జాగా లేకుండా చేయడం మానవత్వమా? ఇది మన అత్యంత భారీ ప్రజాస్వామ్యానికి నిదర్శనమా? హైదరాబాదులో తనపై దాడిచేసిన వారు అలా స్వేచ్చగా, ఎటువంటి కేసులు లేకుండా తిరగుతున్నారంటే మనది ఎంత ఓట్ల రాజకీయమో అర్థమౌతో౦ది.

ఈ సెక్యులర్ దేశంలో ఆమెకి౦త చోటివ్వలేమా? ఓ ఆడకూతురిని రక్షించుకోలేమా?

9, ఫిబ్రవరి 2010, మంగళవారం

విషపు వంగడం పై జన విజయం



దేశ వ్యాప్తంగా ప్రజలనుండి, శాస్త్రవేత్తలనుండి వచ్చిన బలమైన వ్యతిరేకతకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ప్రస్తుతానికి బీ.టీ, వంగ వంగడాల ప్రయోగానికి అడ్డు చెప్పింది. దీనివలన వచ్చే అదనపు దిగుబడి ఏమీ లేకపోయిన ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వస్తుందని తెలిసినా కూడా దీనిని ప్రవేశ పెట్ట చూడడం పాలకవర్గాల విదేశీ శక్తులకు దాస్య మనస్తత్వానికి నిదర్శనం. దేశ వ్యాప్తంగా రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులు, N.G.Os., దీనివలన లాభంకంటే నష్టం ఎక్కువని విడమరిచి చెప్పి మొత్తుకున్నా కేంద్ర మంత్రివర్యులు ఆగ్రహావేశాలు వ్యక్తపరిచారు. అయినా మొక్కవోని దీక్షతో తమ నిరసనను, వ్యతిరేకతను తెలియచేయడంతో కేంద్రం నో చెప్పింది. అయినా అంతా అప్రమత్తంగా వుండి యిటువంటి విషప్రయోగాలనుండి పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

ఇక్కడ మరిన్ని వివరాలు చూడొచ్చుఃhttp://economictimes.indiatimes.com/news/economy/agriculture/Government-decides-against-Bt-Brinjal-for-now/articleshow/5552374.cms

4, ఫిబ్రవరి 2010, గురువారం

మన నేలను విషపూరితం చేస్తున్నారు

ఈ మధ్య కేంద్ర మంత్రివర్యులు జైరాం రమేష్ గారు ప్రతి రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతొ బి.టి. వంగాదాలపై ఆమోద ముద్ర కోసం సమావేశాలు పెడుతున్నారు. ప్రతి చోటా రైతు సోదరులు, శాస్త్రవేత్తలు తమ నిరసనను తెలియచేస్తున్నారు. కానీ వారి మాట వినేవారేవ్వరు. కిరాయి రైతులను ముందుగా మాటాడి౦చి అదే రికార్డు చేసుకు పోతున్నట్లుగా వుంది. ఏదో అంతా ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్సాకంగా చేస్తున్నట్లు భ్రమలు కల్పించే కార్యక్రమం తప్ప ఇది మరోటి కాదు. సెజ్ లకు ఆమోదం కోసం కూడా ఇలానే మీటింగులు చేసారు. కానీ తరువాత మన మాట ఎక్కడా అమలుకాబడలేదు. ఇది కూడా అలానే చేస్తున్నారు. బి.టి పత్తి సాగుచేసిన నెల బీడుగా మార్చబడుతో౦ది. అధిక ఉత్పత్తి పేరుతొ ఈ విషాన్ని మనలాంటి 3 వ ప్రపంచ దేశాలలో ప్రయోగిస్తున్నారు. మనలాంటి వ్యవసాయ ఆధారిత దేశాలలో అసంఘటిత రైతులున్న దగ్గర ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనిని గాట్ ఒప్పందంలో భాగంగా అమలుచేయజూస్తున్నారు. వంకాయకూర విరివిగా వినియోగించే మనం ఈ బీ.టీ.వంగడం ద్వారా వుత్పత్తి అయిన దానిని ఆహారంగా వినియోగిస్తే కాన్సర్ వంటి రోగాలబారిన పడతారని వ్యవాసాయ శాస్త్రవేత్తలుకూడా హెచ్చరిస్తున్నా, పాలక వర్గం ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోవడంలేదు. జన్యుపరమైన జబ్బులకు లోనయితే యిప్పటికే అరకొర వైద్య సౌకర్యాలున్న మన ప్రజలకు దిక్కెవరు. వుత్పత్తి పెంచి ఎవరికి మేలుచేయజూస్తున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధరలేక, వ్యవసాయం జూదంగా మారిన నేడు రైతుసోదరులతో పాటు, అవి వినియోగించే ప్రజల ఆరోగ్యంకు ఎవరు బాధ్యతవహిస్తారు? ప్రపంచీకరణ, సరళీకరణలపేరుతో జరుగుతున్న సామ్రాజ్యవాద దాడిని ప్రజలు నేడు అడ్డుకునే స్థితిలో లేని సమయంలో అమలుజరుగుతున్న ఈ వ్యాపారవర్గాల మోసపూరిత కుట్రను ఆపేదెవరు? సామాన్యుడివైపు నిలిచేదెవరు? అభివృద్ధి పేరుతో జరుగుతున్న యీ రకమైన పాలకవర్గాల దళారీ కుట్రను ప్రజాస్వామికవాదులు, మేధావివర్గం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం వుంది. మనకున్న వనరులను మనం సద్వినియోగం చేసుకుంటే చాలు. ఇప్పటికే వ్యవసాయం నుండి సన్నకారు, చిన్నకారు రైతులు దూరంచేయబడుతున్నారు. ఈ కార్పొరేట్ పాలకులను తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం వుంది.

2, ఫిబ్రవరి 2010, మంగళవారం

మదిలో మెదిలే ఆలోచనలను పంచుకోవాలని

నా మదిలో రగిలే ఆలోచనలను పంచుకోవాలని మీ అందరి స్నేహ హస్తాన్ని ఆశిస్తూ బ్లాగ్ లోకంలోకి అడుగిడుతున్నా. ఈ నేలతల్లిని నమ్ముకున్న వాడిగా, ఒక సామాన్యుడిగా పదుగురి ఆకాంక్షలు, ఆవేశాలు, ఆనందాలు, ఆవేదనలతో సమ్మిళితమవ్వాలని కోరుతూ వినమ్రంగా ఈ విన్నపం...