3, డిసెంబర్ 2010, శుక్రవారం

సోంపేట ఉద్యమానికి ఏడాది..



ఈ రోజుకు సరిగ్గా ఏడాదిగా సోంపేటలో థర్మల్ విద్యుత్ కేంద్రానికి వ్యతిరేకంగా అక్కడి పర్యావరణ పరిరక్షణ సమితి వారు నిరాహారదీక్షా శిబిరాన్ని ప్రారంబించి వారి పోరాటాన్ని కొనసాగిస్తున్నారు. నేడు అక్కడ ఓ పెద్ద సభను నిర్వహిస్తున్నారు. సామాజిక కార్యకర్తలు స్వామి అగ్నివేశ్ వంటి ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ మధ్యకాలంలో వారిపై జరిగిన దాడులు, పోలీసు కాల్పులు, పిపిఎస్ కన్వీనర్ డా.క్రిష్ణమూర్తి గారి ఆసుపత్రిలో బాంబు పేలుడు మొ.న విషయాలు అందరికీ ఎరుకలోనికి వచ్చినవే..


కానీ ఇక్కడ మనం గుర్తించాల్సిన విషయం వారు ఇంతలా పోరాటం చేస్తున్న కంటితుడుపుగా ప్రభుత్వం అక్కడి థర్మల్ పవర్ ప్రోజెక్టుకు అనుమతులు మంజూరు నిలిపివేసామన్నదే కానీ, అసలు భూసేకరణకు సంబంధించి, నిర్వాసితులకు తాయిలాలు చూపడానికి కొత్త కొత్త జీవోలు, సవరణలు తెస్తూ, కొత్తగా పెసా చట్టానికి తూట్లు పొడిచేందుకు కూడా వెనకాడకుండా ప్రజల నోరుమూయించి భూమిని, నీటిని, వనరులను ప్రైవేటు పరం చేసేందుకు పెద్దయెత్తున ప్రపంచబ్యాంకు సంస్కరణలను అమలు చేయడానికి ముందుకు దూసుకు వస్తోంది. సెజ్ లపేరుతో కొత్తగా సామంత రాజ్యాలను ఏర్పాటు చేసుకొనేందుకు పెట్టుబడిదారులకు, ఎం.ఎన్.సి.లకు అవకాశం కల్పిస్తూ దేశ సార్వభౌమత్వాన్నే అమ్మకానికి పెడుతోంది. దీనికి మన కార్పొరేట్ పాలక వర్గం తీవ్రంగా కృషి చేస్తూ, ఉద్యమాలను రకరకాల బూచిని చూపెడుతూ అణచివేయ జూస్తోంది.,

సోంపేట స్ఫూర్తితో ప్రజాస్వామ్యవాదులు, పర్యావరణవాదులు, మేధావులు తప్పనిసరిగా తమ వంతు కర్తవ్యాన్ని నిర్వహించి, ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలవాలని ఆశిస్తున్నాం...

2, నవంబర్ 2010, మంగళవారం

పోలవరం కు అడ్డుకట్ట ఆదివాసీలపాలిట వరం

కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ పోలవరం అనుమతులపై షోకాజ్ నోటీసును ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వ మొండివైఖరిని ప్రశ్నించిందన్న వార్త పర్యావరణ అభిమానులకు కాసింత ఊరటనిచ్చింది. దివంగత ముఖ్యమంత్రి పోలవరాన్ని సాధించి తీరుతానని ప్రకటించి ఆదివాసీల, మత్స్యకారుల, సాధారణ రైతులు, ముంపునకు గురయ్యే భూమిపుత్రుల రోదనను పెడచెవిన పెట్టి జాతీయ హోదాకోసం తీవ్రంగా ప్రయత్నించి ప్రజల, పర్యావరణ వేత్తల సూచనలను పట్టించుకోలేదు. సుమారు 5 లక్షలమంది ప్రజలను నిర్వాసితులుగా మార్చే ఈ భారీ ప్రాజెక్టు గర్భంలో కలిసిపోయే సహజ సంపదను ఎలా వెలకట్టగలరు. భారీ ప్రాజెక్టుల మూలంగా భూకంపాలొస్తున్నాయన్న సూచనలను పట్టించుకోకుండా ప్రాజెక్టు అనుమతులు రాకముందే కాల్వల నిర్మాణాన్ని కాంట్రాక్టర్లకు అప్పగించి ఆమ్యామ్యాలు మింగుతున్న వారికిది మింగుడుపడదు. అటు ఒరిస్సా, చత్తీస్ఘడ్ ప్రభుత్వాలు తమ భూభాగంలో ముంపునకు గురయ్యే ప్రజల విజ్నప్తులను సుప్రీంకోర్టునకు విన్నవించి యున్నారు. అసలు ఇన్ని ఆటంకాల నడుమ వున్న ప్రాజెక్టును ఎలా పూర్తిచేయగలరు. ఓ 2000 ఎకరాలకు నీరందించే జంఘావతి ప్రాజెక్ట్, వంశధార రెండో దశలే ఒరిస్సావారి అభ్యంతరాలతో మూలన పడ్డాయి. అలాంటిది నిర్వాసితులౌతున్న వారి దగ్గరనుంచి, పొరుగు రాష్ట్రాల వారి అభ్యంతరాలతో ఎలా పూర్తి చేస్తారు. తమ ఫాక్షన్ పోకడలతో ఏదీ చెవినెక్కని వారికి తప్ప మిగిలిన వారికేమైంది. ప్రజల సుఖ సంతోషాలు నిజంగా కోరే వారైతే పర్యావరణ నిపుణుల సలహాలను పాటించి చిన్న చిన్న బ్యారేజీలను నిర్మించడం ద్వారా త్వరగా సాగునీరు అందించి అభివృద్ధికి పాటుపడవచ్చు. ఇందుకు టి.హనుమంతరావు వంటివారి సలహాలను, సూచనలను పాటించమని విన్నపం. పంతాలకు పోయి ప్రజలను నిర్వాసితులను చేసి, సామాజిక అంతరాలను పెంచడంద్వారా, భవిష్యత్తులో అటు సామాజికంగా, పర్యావరణ పరంగా ఎదురయ్యే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవడం అసాధ్యం కావచ్చు.

నియాంగిరీ పర్వత శ్రేణులలోని 2000 మంది గిరిజనుల పోరాటాన్ని కీర్తించి వారికి సైనికుడిగా ప్రకటించుకున్న కాంగ్రెస్ యువరాజు ఇక్కడి 5 లక్షల మంది నిర్వాసితుల గోడు వినమని విజ్నప్తి చేస్తున్నాం..

Polavrm Article

Barrages Are Better Way
>

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఉత్తరాంధ్ర గుండెలపై ఇన్ని కుంపట్లా?



మొన్నటి సోంపేట ప్రజల నిరసనను ఒక పక్క గుర్తిస్తున్నట్లు నటిస్తూనే ప్రభుత్వం దాని ప్రక్కనే వున్న వజ్రపుకొత్తూరు మండలంలోని గునిపల్లి, చీపురుపల్లి పక్క గ్రామాలనుండి సుమారు 1500 ల ఎకరాల వ్యవసాయ భూమిని మరో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలా ఒకే ప్రాంతంలో తొమ్మిది థర్మల్, ఓ అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం చేపట్టడం ద్వారా ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్రకాదా ఇది? ఇక్కడి ప్రజల నిస్సహాయతను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పాలక ప్రతిపక్ష నాయకులు లోపాయకారీ ఒప్పందాలతో ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. ఇంతటి ఘోరానికి ఒడిగట్టడానికి వీళ్ళకి మనసెలా ఒప్పుతోందో? ఈ ప్రశ్న కాస్తా విడ్డూరంగానే అనిపించొచ్చు. నిర్వాసిత పేకేజీల ఆశ చూపి వీరిని తమ భూమినుండి వేరుచేయడానికి కుట్ర జరుగుతోంది. నేలను కోల్పోయిన తరువాత వారి జీవన పరిస్థితులు ఎలాంటి ఒడిదుడుకులకు లోనవుతాయో, తద్వారా సమాజంలో రాబోయే పరిణామాలు ఎంతటి ఘోరానికి దారితీస్తాయో కాస్తా అవగాహన వున్న ఎవరికైనా తెలుస్తుంది. కానీ ప్రజల పట్ల, సమాజ పురోగతి పట్ల, భవిష్యత్ పరిణామాల పట్ల బాధ్యత లేని పాలక వర్గం ప్రజలను మోసంచేసి తద్వారా తమ సొంత లాభాలను మూటకట్టుకోజూడడం పెను విషాదం. కావున ప్రజలపై సాగుతున్న ఈ రకమైన రాక్షసకృత్యాన్ని ఆపేందుకు బాధ్యతగల ప్రజాస్వామ్య, పర్యావరణ, మేధావి వర్గం ముందుకు రావాల్సిన అవసరముంది.

24, ఆగస్టు 2010, మంగళవారం

వేదాంతపై కోంధ్ ల విజయం



భారతదేశంలోనే అత్యంత సంపన్నుడిగా ఇటీవల వార్తలకెక్కిన అగర్వాల్ యొక్క వేదాంత గ్రూపు ఒడిస్సాలో తలపెట్టిన బాక్సైట్ మైనింగ్, ఫ్యాక్టరీలకు కేంద్ర పర్యావరణ కమిటీ అంతర్జాతీయంగాను, దేశ పర్యావరణ ప్రజాస్వామ్య వాదుల వత్తిడికి తలొగ్గి అనుమతులను రద్దు చేసుకోవడం ప్రజా విజయంగానే గుర్తించాలి. లంజిఘర్ లో 1.7 బిలియన్ డాలర్ల బాక్సైట్ మైనింగ్ వలన అక్కడ స్థానికులైన అరుదైన తెగ కేవలం 8,000 మంది మాత్రమే మిగిలిన కోంధ్ గిరిజనుల ఉనికికే ప్రమాదంగా మారి, వారి ఆరాధ్య దేవతైన నియాంగిరీ కొండ అదృశ్యమయ్యే ప్రమాదాన్ని వాళ్ళు ముందుగానే పసిగట్టి అవతార్ సినిమాలోని తెగ పోరాటంవలే సామ్రాజ్య దళారీలను అడ్డుకునేందుకు అంతర్జాతీయంగా తమ పోరాటాన్ని, నిరసనను ప్రచారం చేయడంతో కేంద్రం దిగివచ్చి వేదాంతకు అనుమతులు నిరాకరించింది. కానీ, దళారీ కార్పొరేట్ పాలకుల తొత్తు అయిన ఒడిస్సా ముఖ్యమంత్రి ఈ ప్రాజెక్టులనుమతికోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. కనుక ప్రజాస్వామ్యవాదులు, పర్యావరణ వాదులు, మేధావులు కోంధ్ ల నిజమైన అవతార్ తరహా పోరాటాన్ని సమర్థిస్తూ వేదాంతను అడ్డుకొనేందుకు ముందుకు రావాలి.

2, జులై 2010, శుక్రవారం

ఈ ఫోటో ఓ పెద్ద వ్యాసానికి సమానం



ఈ కింది లింక్ లలో వివరాలు చూడొచ్చుః
The Great Indian Clearance Sale
Based on Center for Science and Environment's report on mining: http://www.cseindia.org/node/435
http://www.facebook.com/afsarm?v=wall&story_fbid=134092203279686#!/greatindiansale

14, జూన్ 2010, సోమవారం

ద.ఆఫ్రికాను ముంచే ప్రయత్నం..



ప్రపంచమంతా ఆర్థిక మాంద్యంతో కొట్టుమిట్టాడుతూ, నిరుద్యోగం, ద్రవ్యోల్బణంతో దేశాలన్నీ కుదేలైపోతున్న సమయంలో ద.ఆఫ్రికా వంటి తృతీయ ప్రపంచ దేశం, కొద్ది సం.ల క్రితం వరకు వలస బానిసత్వంలో మగ్గిన దేశం ఏం అభివృద్ధి సాధించిందని సాకర్ క్రీడలను వేలకోట్ల పెట్టుబడితో నిర్వహించాలనుకుంది. యూరోప్, పశ్చిమ దేశాల కుట్రలో ఇది కూరుకుపోయి ఈ భారాన్ని నెత్తికెత్తుకున్నట్లుగా అనిపిస్తోంది. తాము నిర్వహించి చేతులు కాల్చుకోకుండా ఇలా ఒక నిర్భాగ్య దేశాన్ని బలిచేసి మరో సోమాలియాగా మార్చేయడానికి పన్నాగంగా అనిపిస్తోంది.

ఇంతకు ముందు ఇండియాలో ఆసియాక్రీడలు నిర్వహించి కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసారు. దీని నిర్వహణ వలన వచ్చిన ఆదాయమూలేదు, కొత్తగా వచ్చేసిన పతకాలూ లేవు. ఇలాంటిదే మరల అక్కడ జరుగుతోంది. ఆ దేశం గొప్పగా చెప్పుకునే క్రీడాకారులు గానీ, వాళ్ళు సంపాదించిన అంతర్జాతీయ స్థాయి పతకాలూ లేవు. మరి ఏమాశించి ఈ క్రీడలు జరప నిర్ణయం తీసుకున్నారో. అక్కడి రాజకీయ నాయకులు, అధికారులు కోటీశ్వరులవ్వడం ఖాయం. ప్రజలు మరో దశాబ్ధం పాటు వెనకబడడం ఖాయం. ఇలా అంతర్జాతీయ క్రీడలు నిర్వహించే ముందు తమ స్థాయిని గుర్తెరిగి నిర్వహిస్తే మంచిది. లేకపోతే భవిష్యత్ తరాలు వీళ్ళ నిర్వాకానికి అడుక్కు తినాలి.

ఆ మధ్య ఆంధ్ర ప్రదేశ్ లో కూడా అరువు క్రీడాకారులతో బాబు కూడా ఇలానే జాతీయ క్రీడలు నిర్వహించారు. దాంతో మరింత అప్పులు పెరిగాయి తప్ప మరేమీ లేదు.

ఇదంతా ప్రజలను అథఃపాతాళానికి తొక్కే రాజకీయ నాయకుల క్రీడా విన్యాసాలు తప్ప మరేమీ కాదు. ఆఫ్రికా వాసులారా బహు పరాక్.

7, జూన్ 2010, సోమవారం

పాతికేళ్ళ తరువాత కూడా కన్నీళ్ళే మిగిల్చారు..

భూమ్మీద జరిగిన అత్యంత విషాదకర, వినాశకర సంఘటనగా పేర్కొనబడ్డ భోపాల్ గాస్ దుర్ఘటనపై ఈ రోజు స్థానిక కోర్టు యిచ్చిన తీర్పు బాధితులకు యిన్నేళ్ళ తరువాత కూడా కన్నీళ్ళే మిగిల్చింది. కేసులో వున్న నాటి యూనియన్ కార్బైడ్ ఇండియా మాజీ చైర్మన్ కేషుబ్ మహీంద్రా మరి 7 గురిని దోషులుగా నిర్థారిస్తూ తీర్పు చెప్పింది. వీళ్ళకు 3500 మందికి పైగా చావుకు, అనేక వేల మంది తీవ్ర అనారోగ్యానికి కారణమైన వారికి రెండు సం.ల కారాగార శిక్ష కొంత మొత్తం జరిమానా విధించవచ్చని తెలుస్తోంది. అసలు దోషిఅయిన కంపెనీ చైర్మన్ వారన్ ఆండర్సన్ ను పరారీలో వున్న నిందితుడుగా చూపిస్తున్నారు. ఇదీ మన న్యాయవ్యవస్థ ఇచ్చే తీర్పుల ప్రతిఫలం. డబ్బు, అధికారం వున్న వారినేం చేయలేనితనం. సామ్రాజ్యవాదులకు దాసోహమైన బానిసతనం. ఇప్పటివరకు బాధిత కుటుంబాలకు సరైన పరిహారమే అందలేదన్నది సత్యదూరం కాదు. ఇలాంటి వ్యవస్థలున్న చోట అణువిద్యుత్ ప్రాజెక్టులు నెలకొల్పడానికి అత్యుత్సాహం చూపుతున్న మన పాలక వర్గం ఖర్మ కాలి ఏదైనా జరిగితే దేశంలో జనాభా తగ్గిందిలే అని సంతృప్తి పడతారేమో. సరైన రక్షణ కార్యాచరణ లేకుండా, పర్యావరణం నాశనమయ్యి జనావళి మనుగడ ప్రశ్నార్థకమవుతున్న కాలంలో వున్న మనం యిటువంటి కర్మాగారాలకు, ప్రాజెక్టులకు, వినాశకర అభివృద్ధికి వ్యతిరేకంగా పోరాడకపోతే భవిష్యత్ తరమే కాదు ఈ తరంకూడా భూమ్మీద బతికే చాన్సు ఉండదు, కొత్త కొత్త జబ్బులతో నరకయాతన పడక తప్పని స్థితి ఎంతో దూరంలో లేదు.

భోపాల్ మృతులకు మరోమారు శ్రద్ధాంజలి ఘటిద్దాం. వారి వారసుల పోరాటానికి మద్దతునిద్దాం..



http://www.telegraph.co.uk/news/worldnews/asia/india/7807904/Bhopal-managers-face-prison-for-role-in-Union-Carbide-gas-disaster.html

http://news.rediff.com/slide-show/2010/jun/07/slide-show-1-bhopal-gas-tragedy-verdict.htm

30, మే 2010, ఆదివారం

సెల్ సిగ్నల్స్ వలన ఆహార భద్రతకు ముప్పు



ఇప్పటికే జన్యు మార్పిడి పంటల వలన, పురుగు మందుల కారణంగా తేనెటీగల కాలనీలు కనిపించకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. ఇప్పుడు ఈ ప్రమాదం సెల్ ఫోన్ విడుదల చేస్తున్న విద్యుదయస్కాంత రేడియేషన్ వలన కూడా ఉంటుందని పంజాబ్ యూనివర్శిటీకి చెందిన పరిశోధకులు గమనించారు. సెల్ ఫోన్ రేడియేషన్ తేనెటీగల శరీరంలో ఉండే అయస్కాంతత్వంపై ప్రభావం చూపడం వలన తేనెటీగల సామర్థ్యం దెబ్బతింటోందని వారు చెబుతున్నారు. సెల్ ఫోన్ టవర్ల నుంచి వచ్చే తరంగాల కారణంగా తేనెటీగల తేనె సేకరించే సామర్థ్యం దెబ్బతిన్నట్లు కేరళకు చెందిన సయినుద్దీన్ పట్టాజే చేసిన అధ్యయనంలో కూడా వెల్లడైంది. తేనెటీగల సంఖ్య తగ్గిపోతే సహజంగా జరిగే పరపరాగ సంపర్కం మందగించిపోతుందని, దీంతో కాయలు, పళ్ళ చెట్ల ఉనికి నశించి, ఆహార భద్రతకే ప్రమాదం ఏర్పడుతుందని హెచ్చరిస్తున్నారు.

ఇప్పటికే పిచ్చుకలు, హమ్మింగ్ బర్డ్స్ వంటి పక్షిజాతులు సెల్ సిగ్నల్స్ వలన అంతరించిపోతున్నాయి. అలాగే వీటి వలన మన మెదడుపై కూడా దుష్ప్రభావాలు చాల వున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఇది మానవ సంబంధాలపై చూపుతున్న దుష్ప్రభావాలు మన గ్రహింపులో వున్నా మన దైనందిన జీవితంలో భాగమైపోయిన ఈ సెల్ ను ప్రస్తుతం వినియోగించకుండా ఆపే స్థితిలో లేము కాబట్టి దీనికి ప్రత్యామ్యాయ పద్ధతులపై నివారణ చర్యలపై శాస్త్రవేత్తలు దృష్తి సారించకపోతే ఈ సెల్ ద్వాపరయుగంలోని ముసలంలా మన యుగాన్ని అంతం చేసె మహమ్మారి కాగలదు.


(ఆంధ్రజ్యోతి 29.05.2010 వార్త ఆధారంగా)

22, మే 2010, శనివారం

ఈ దశాబ్ధపు ఘోర విషాదం



ఈ దశాబ్ధంలోనే అతి పెద్ద ప్రమాదం, భారత్ లో జరిగిన మూడో ఘోర ప్రమాదంగా అందరిని కలచివేసిన మంగళూరు విమాన ప్రమాదం. ఎవరి తప్పిదంవలన జరిగినా 167 నిండు ప్రాణాలను బలిగొన్నారు.

ఈ మధ్య ఏదైనా సంఘటన జరిగితే రాజీనామా చేస్తాననడం మన మంత్రివర్యులకు ఫ్యాషన్ అయ్యింది. ఎలాగూ ఆమోదించరని తెలిసి ఈ నాటకం. ఎంత ఎక్స్ గ్రేషియా ఇస్తే మాత్రం పోయిన ప్రాణాలు తిరిగి వస్తాయా. ఆ కొండలు గుట్టలలో విమానాశ్రయం, చిన్న రన్ వే పై భారీ విమానాలను దించడం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడటమే.

సంతాప తీర్మానాలు కాదు ప్రమాద నివారణ చర్యలు చేపట్టి భవిష్యత్ తరాలకు నిబ్బరాన్నివ్వాలని కోరుకుందాం.. యిది అత్యాశేనా?..

21, ఏప్రిల్ 2010, బుధవారం

ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్



నిన్నటి వైట్ హోస్ మీడియా సమావేశంలో సెక్రటరీ రాబర్ట్ గిబ్స్ మరో మారు బిన్ లాడెన్ ను సజీవంగానైనా, శవంగానైనా పట్టుకుంటామని భీషణ ప్రతిజ్ఞా చేశారు. ఇది ఈ దశాబ్దపు అతి పెద్ద జోక్ గా అనిపిస్తోంది. 9 /11 2001 తరువాత నుండి ఈ ప్రతినలు వింటూనే వున్నాం. ఈ పేరుతొ ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, పాకిస్తాన్ గిరిజన ప్రాంతాలపై కార్పెట్ బాంబింగ్ చేస్తూ ప్రజల ప్రాణాలను హరిస్తున్నారు. దీనికి ప్రతీకారంగా వాళ్ళు మానవ బాంబులతో దాడులు చేస్తూ అమాయక ప్రానాలరిస్తున్నారు. ఇప్పటికే అమెరికన్ సైనికులు అసహనానికి గురికాబడుతున్నారు. వారిని ఉత్తెజపరిచేమ్దుకు ఒబామా కూడా పరామర్షి౦చాల్సి వస్తోంది. సైన్యాన్ని ఉపసంహరిస్తానన్న వాగ్ధానంతో అమ్దలమేక్కిన ఒబామా అది మరిచిపోయాడు. అది ఒబామాకు సాధ్యమా? అసలు అమెరికన్ సామ్రాజ్యం సైనిక, ఆయుధ వ్యాపారంతో ముడిపడి వున్నది. పులి మాంసాహారం మానేసానన్నట్లు వుంటుంది ఇలాంటి మాటలు.

12, మార్చి 2010, శుక్రవారం

ఉత్తరాంధ్ర అవతార్




ఆంధ్రజ్యోతి ఎడిటోరియల్ తే.13-03-10దీ.

4, మార్చి 2010, గురువారం

టెక్టోనిక్ - భూకంపాయుధం



మొన్నటి హైతీ భూకంపానికి కారణం హైతీకి దగ్గరలో భూకంపం సృష్టించే ఆయుధాల్ని ప్రయోగం చెయ్యడం వల్లనే ఈ పరిణామం సంభావిమ్చినదని వెనెజులా అధ్యక్షుడు చావెజ్ ఆరోపిస్తున్నారు. ప్రక్రుతి విలయం ముసుగులో హైతీని ఆక్రమించాలని అమెరికా చూస్తున్నట్లుగా ఆయన ఇంతకుముందే ప్రకటించారు. వాతావరణంలో తీవ్రమైన మార్పులను తేగల హాయ్ ఫ్రీక్వెన్సీ ఆక్టివ్ ఆరోరాల్ రీసెర్చ్ ప్రోగ్రాం (HAARP) కి సంబంధించినది. 1997లో అమెరికా మాజీ రక్షణమంత్రి కొన్ని దేశాలు విద్యుదయస్కాంత తరంగాల ద్వారా భూకంపాలని ప్రేరేపించడానికి, అగ్నిపర్వతాలని పేల్చడానికీ ప్రయత్నాలు చేస్తున్నాయన్నారు. ఆ దేశాలు వాతావరణ సంబంధమైన ఉగ్రవాదంలో నిమగ్నమై ఉన్నాయని ఆరోపించారు. హైతీ భూకంపానికి అమెరికా చేసిన TECTONIC ఆయుధాన్ని ప్రయోగించి చూడటమే కారణంగా చావెజ్ చెబుతున్నారు. యిది కేవలం ప్రయోగం మాత్రమే అసలు లక్ష్యం ఇరాన్ గా చెబుతున్నారు. దీన్ని భూకంపాయుధం అంటున్నారు. అమెరికా, రష్యాలవద్ద యిలాంటి ఆయుధాలున్నాయని చెబుతున్నారు. ప్రపంచ దేశాలను భయపెట్టడానికే అమెరికా యిటువంటి ఆయుధాలను ప్రయోగించేందుకు వెనుకాడటంలేదు.

ప్రపంచంలోనే స్వాతంత్రం సాధించుకున్న మొట్టమొదటి నల్లజాతి దేశం హైతీ. హైతీ విప్లవకాలంలో ఫ్రెంచ్ వలసల్లో అత్యంత సంపన్నమైనది. ఫ్రెంచ్ విప్లవం స్ఫూర్తిగా అది తన స్వాతంత్రాన్ని 1804 జనవరి 1న తిరుగుబాటుద్వారా అది స్వేచ్చను పొందింది. ఆ తిరుగుబాటు ఇతర దేశాలలోని బానిసలను మేల్కొలుపుతుందని అమెరికా, ఫ్రాన్స్ లు హైతీని ప్రపంచదేశాలలో ఒంటరిని చేసాయి. ఆ తరువాత హైతీని ఆర్థిక దిగ్భంధంలో అనేక సంల పాటు వుంచాయి. అక్కడ ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలను కూలదోసి తమ ఏజెంట్లతో పరిపాలన సాగిస్తోంది అమెరికా. అమెరికా దుస్తుల తయారీ పరిశ్రమకు అతి చౌకగా హైతీయన్లను వాడుకుంటుంది. హైతీనుంచి అమెరికాలోకి పోయేవాళ్ళని అక్కడి ప్రభుత్వం శిక్షించేలా శాశిస్తున్నారు. ప్రస్తుతం ఒబామా క్లింటన్, బుష్ లను తన దూతలుగా హైతీ బాధ్యతలు అప్పగించాడు.

భూకంపాయుధాల ప్రయోగం కారణంగానే యిటీవలి భూకంప ప్రళయాలు జరుగుతున్నాయని, యిది వాతావరణ సంబంధ ఉగ్రవాదాన్ని సరికొత్తగా ప్రయోగిస్తూ ప్రపంచదేశాలను అమెరికా తన గుప్పెట్లో వుంచుతోంది. దీనిని అంతా ఖండించాలని కోరుకుందాం!

ఈ లింక్ లలో కొంత రిపోర్టు వుందిః1.http://boingboing.net/2010/01/22/venezuelan-president.html
2. http://uswgo.com/i-believe-the-incident-at-haiti-was-caused-by-a-tectonic-weapon.htm

(ఈ సమాచారం వీక్షణం ఫిబ్రవరి 2010 సంచికలో హైతీ భూకంపం - అమెరికా సామ్రాజ్యవాదం, రచయిత E.S.బ్రహ్మచారి ద్వారా గ్రహించడమైనది)

23, ఫిబ్రవరి 2010, మంగళవారం

ఆఫ్ఘన్ భూభాగంపై నాటో మారణకాండ



ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ల ఏరివేత పేరుతో ఇప్పటికే టన్నులకొద్ది బాంబు దాడులు చేస్తున్న నాటో దళాలు గత వారం రోజుల్లో సుమారు 50 మంది అమాయక ప్రజల ప్రాణాలు తీసాయి. మజ్రా ప్రాంతంలో మొన్న జరిగిన వైమానిక దాడిలో మూడు జీపులలో వెళ్తున్న సామాన్య పౌరులు 27 మంది చనిపోయారు. దీనిపై ప్రజలలో తీవ్రమైన ఆగ్రహావేశాలు వెల్లువెత్తడంతో తమ కీలుబొమ్మ అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ కూడా దీనిని ఖండిస్తూ సివిలియన్ మరణాలు లేకుండా చూడమని మొత్తుకున్నారు. దీనికి ప్రతిస్పందనగా నాటో కమాండర్ క్శమాపణలు చెప్పాడు. సారీ చెప్పినంత మాత్రాన వారి ప్రాణాలు తిరిగివస్తాయా? ఆఫ్ఘనిస్తాన్ పై గత 30 ఏళ్ళకు పైగా పరాయి దేశాల ఆధిపత్యం కొనసాగుతోంది. దీనికి ప్రత్యామ్నాయంగా స్థానిక గిరిజనులు, ప్రజలు పోరాటాలు చేస్తున్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించిన అగ్రరాజ్యం దాని ఫలితాన్ని అనుభవిస్తోంది. తిరిగి అదే ఉగ్రవాదాన్ని రూపుమాపుతానని అక్కడి ప్రజల మాన ప్రాణాలను హరిస్తోంది. ఎవరి భూభాగం వారు పాలించుకునే స్వేచ్చ లేకుండా తమ అవసరాలు తీర్చుకొనడానికి దురాక్రమణలు చేసి, అక్కడి ప్రభుత్వాలను కూలదోసి, తమ సొంత కీలుబొమ్మ పాలకులతో నడిపించి తమ వ్యాపారాలను నిరాటంకంగా చేసుకునే అగ్రరాజ్య దురహంకారాన్ని వ్యతిరేకించాలి. దానికి వత్తాసు పలికే నాటో సభ్యదేశాల కుటిల రాజనీతిని బయటపెట్టాలి.

17, ఫిబ్రవరి 2010, బుధవారం

ఈ సెక్యులర్ దేశంలో ఆమెకి౦త చోటివ్వలేమా?




తన రచనల ద్వారా మాతృదేశ బహిష్కరణకు గురై ప్రస్తుతం తానూ తన దేశంకంటే ఎక్కువగా అభిమానించే ఈ సువిశాల భారత దేశంలో తనకు నీడనిమ్మని దీనంగా వేడుకుంటున్న తస్లీమాను ఏ ప్రయోజనాలకు బలిచేస్తున్నారో? ముస్లిం వర్గం నుండి వచ్చిన బెదిరింపులకు లొంగి ఆమెకు జాగా లేకుండా చేయడం మానవత్వమా? ఇది మన అత్యంత భారీ ప్రజాస్వామ్యానికి నిదర్శనమా? హైదరాబాదులో తనపై దాడిచేసిన వారు అలా స్వేచ్చగా, ఎటువంటి కేసులు లేకుండా తిరగుతున్నారంటే మనది ఎంత ఓట్ల రాజకీయమో అర్థమౌతో౦ది.

ఈ సెక్యులర్ దేశంలో ఆమెకి౦త చోటివ్వలేమా? ఓ ఆడకూతురిని రక్షించుకోలేమా?

9, ఫిబ్రవరి 2010, మంగళవారం

విషపు వంగడం పై జన విజయం



దేశ వ్యాప్తంగా ప్రజలనుండి, శాస్త్రవేత్తలనుండి వచ్చిన బలమైన వ్యతిరేకతకు కేంద్ర ప్రభుత్వం తలొగ్గి ప్రస్తుతానికి బీ.టీ, వంగ వంగడాల ప్రయోగానికి అడ్డు చెప్పింది. దీనివలన వచ్చే అదనపు దిగుబడి ఏమీ లేకపోయిన ప్రజల ఆరోగ్యానికి తీవ్రమైన ముప్పు వస్తుందని తెలిసినా కూడా దీనిని ప్రవేశ పెట్ట చూడడం పాలకవర్గాల విదేశీ శక్తులకు దాస్య మనస్తత్వానికి నిదర్శనం. దేశ వ్యాప్తంగా రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, పర్యావరణ ఉద్యమకారులు, N.G.Os., దీనివలన లాభంకంటే నష్టం ఎక్కువని విడమరిచి చెప్పి మొత్తుకున్నా కేంద్ర మంత్రివర్యులు ఆగ్రహావేశాలు వ్యక్తపరిచారు. అయినా మొక్కవోని దీక్షతో తమ నిరసనను, వ్యతిరేకతను తెలియచేయడంతో కేంద్రం నో చెప్పింది. అయినా అంతా అప్రమత్తంగా వుండి యిటువంటి విషప్రయోగాలనుండి పర్యావరణాన్ని, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది.

ఇక్కడ మరిన్ని వివరాలు చూడొచ్చుఃhttp://economictimes.indiatimes.com/news/economy/agriculture/Government-decides-against-Bt-Brinjal-for-now/articleshow/5552374.cms

4, ఫిబ్రవరి 2010, గురువారం

మన నేలను విషపూరితం చేస్తున్నారు

ఈ మధ్య కేంద్ర మంత్రివర్యులు జైరాం రమేష్ గారు ప్రతి రాష్ట్రంలో ప్రజాభిప్రాయ సేకరణ పేరుతొ బి.టి. వంగాదాలపై ఆమోద ముద్ర కోసం సమావేశాలు పెడుతున్నారు. ప్రతి చోటా రైతు సోదరులు, శాస్త్రవేత్తలు తమ నిరసనను తెలియచేస్తున్నారు. కానీ వారి మాట వినేవారేవ్వరు. కిరాయి రైతులను ముందుగా మాటాడి౦చి అదే రికార్డు చేసుకు పోతున్నట్లుగా వుంది. ఏదో అంతా ప్రజాస్వామ్య పద్ధతిలో పారదర్సాకంగా చేస్తున్నట్లు భ్రమలు కల్పించే కార్యక్రమం తప్ప ఇది మరోటి కాదు. సెజ్ లకు ఆమోదం కోసం కూడా ఇలానే మీటింగులు చేసారు. కానీ తరువాత మన మాట ఎక్కడా అమలుకాబడలేదు. ఇది కూడా అలానే చేస్తున్నారు. బి.టి పత్తి సాగుచేసిన నెల బీడుగా మార్చబడుతో౦ది. అధిక ఉత్పత్తి పేరుతొ ఈ విషాన్ని మనలాంటి 3 వ ప్రపంచ దేశాలలో ప్రయోగిస్తున్నారు. మనలాంటి వ్యవసాయ ఆధారిత దేశాలలో అసంఘటిత రైతులున్న దగ్గర ఈ ప్రయోగాలు జరుగుతున్నాయి. దీనిని గాట్ ఒప్పందంలో భాగంగా అమలుచేయజూస్తున్నారు. వంకాయకూర విరివిగా వినియోగించే మనం ఈ బీ.టీ.వంగడం ద్వారా వుత్పత్తి అయిన దానిని ఆహారంగా వినియోగిస్తే కాన్సర్ వంటి రోగాలబారిన పడతారని వ్యవాసాయ శాస్త్రవేత్తలుకూడా హెచ్చరిస్తున్నా, పాలక వర్గం ఏమాత్రం పట్టించుకున్న పాపాన పోవడంలేదు. జన్యుపరమైన జబ్బులకు లోనయితే యిప్పటికే అరకొర వైద్య సౌకర్యాలున్న మన ప్రజలకు దిక్కెవరు. వుత్పత్తి పెంచి ఎవరికి మేలుచేయజూస్తున్నారు. పండిన పంటకు గిట్టుబాటు ధరలేక, వ్యవసాయం జూదంగా మారిన నేడు రైతుసోదరులతో పాటు, అవి వినియోగించే ప్రజల ఆరోగ్యంకు ఎవరు బాధ్యతవహిస్తారు? ప్రపంచీకరణ, సరళీకరణలపేరుతో జరుగుతున్న సామ్రాజ్యవాద దాడిని ప్రజలు నేడు అడ్డుకునే స్థితిలో లేని సమయంలో అమలుజరుగుతున్న ఈ వ్యాపారవర్గాల మోసపూరిత కుట్రను ఆపేదెవరు? సామాన్యుడివైపు నిలిచేదెవరు? అభివృద్ధి పేరుతో జరుగుతున్న యీ రకమైన పాలకవర్గాల దళారీ కుట్రను ప్రజాస్వామికవాదులు, మేధావివర్గం తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం వుంది. మనకున్న వనరులను మనం సద్వినియోగం చేసుకుంటే చాలు. ఇప్పటికే వ్యవసాయం నుండి సన్నకారు, చిన్నకారు రైతులు దూరంచేయబడుతున్నారు. ఈ కార్పొరేట్ పాలకులను తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం వుంది.

2, ఫిబ్రవరి 2010, మంగళవారం

మదిలో మెదిలే ఆలోచనలను పంచుకోవాలని

నా మదిలో రగిలే ఆలోచనలను పంచుకోవాలని మీ అందరి స్నేహ హస్తాన్ని ఆశిస్తూ బ్లాగ్ లోకంలోకి అడుగిడుతున్నా. ఈ నేలతల్లిని నమ్ముకున్న వాడిగా, ఒక సామాన్యుడిగా పదుగురి ఆకాంక్షలు, ఆవేశాలు, ఆనందాలు, ఆవేదనలతో సమ్మిళితమవ్వాలని కోరుతూ వినమ్రంగా ఈ విన్నపం...