21, సెప్టెంబర్ 2010, మంగళవారం

ఉత్తరాంధ్ర గుండెలపై ఇన్ని కుంపట్లా?



మొన్నటి సోంపేట ప్రజల నిరసనను ఒక పక్క గుర్తిస్తున్నట్లు నటిస్తూనే ప్రభుత్వం దాని ప్రక్కనే వున్న వజ్రపుకొత్తూరు మండలంలోని గునిపల్లి, చీపురుపల్లి పక్క గ్రామాలనుండి సుమారు 1500 ల ఎకరాల వ్యవసాయ భూమిని మరో థర్మల్ పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి కట్టబెట్టే ప్రయత్నం చేస్తోంది. ఇలా ఒకే ప్రాంతంలో తొమ్మిది థర్మల్, ఓ అణు విద్యుత్ కేంద్ర నిర్మాణం చేపట్టడం ద్వారా ఈ ప్రాంతాన్ని ఎడారిగా మార్చే కుట్రకాదా ఇది? ఇక్కడి ప్రజల నిస్సహాయతను, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని పాలక ప్రతిపక్ష నాయకులు లోపాయకారీ ఒప్పందాలతో ఈ నిర్మాణాలను చేపడుతున్నారు. ఇంతటి ఘోరానికి ఒడిగట్టడానికి వీళ్ళకి మనసెలా ఒప్పుతోందో? ఈ ప్రశ్న కాస్తా విడ్డూరంగానే అనిపించొచ్చు. నిర్వాసిత పేకేజీల ఆశ చూపి వీరిని తమ భూమినుండి వేరుచేయడానికి కుట్ర జరుగుతోంది. నేలను కోల్పోయిన తరువాత వారి జీవన పరిస్థితులు ఎలాంటి ఒడిదుడుకులకు లోనవుతాయో, తద్వారా సమాజంలో రాబోయే పరిణామాలు ఎంతటి ఘోరానికి దారితీస్తాయో కాస్తా అవగాహన వున్న ఎవరికైనా తెలుస్తుంది. కానీ ప్రజల పట్ల, సమాజ పురోగతి పట్ల, భవిష్యత్ పరిణామాల పట్ల బాధ్యత లేని పాలక వర్గం ప్రజలను మోసంచేసి తద్వారా తమ సొంత లాభాలను మూటకట్టుకోజూడడం పెను విషాదం. కావున ప్రజలపై సాగుతున్న ఈ రకమైన రాక్షసకృత్యాన్ని ఆపేందుకు బాధ్యతగల ప్రజాస్వామ్య, పర్యావరణ, మేధావి వర్గం ముందుకు రావాల్సిన అవసరముంది.